Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కరోనా కాటుకు వణుకుతున్న యూరప్.. ఒక్క రోజులో లక్షలాది కేసులు

Record Covid cases in US and Europe
  • ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాలో ప్రతి రోజూ లక్షలాది కేసులు
  • అమెరికాలో నమోదవుతున్న కేసుల్లో 95 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌వే
  • భారత్ సహా పలు దేశాల విమాన సర్వీసులను నిషేధించిన హాంకాంగ్
  • టీకా వేసుకోని వారికి ఇబ్బందులు తప్పవన్న ఫ్రాన్స్ అధ్యక్షుడి వ్యాఖ్యలపై ఆగ్రహం
యూరప్‌లో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. ప్రతి రోజూ లక్షలాది కేసులతో వణుకుతోంది. నిన్న 24 గంటల వ్యవధిలో  ఫ్రాన్స్‌లో 2.70 లక్షలు, బ్రిటన్‌లో 2 లక్షల మందికిపైగా కొవిడ్ బారినపడ్డారు. ఇక, అమెరికాలోనూ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.

సోమవారం ఆ దేశంలో ఏకంగా 10 లక్షలకు పైగా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత వారం రోజులుగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 95 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించినవే ఉండడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రజలంతా తప్పకుండా కరోనా టీకాలు వేయించుకోవాలని సూచించింది.

ప్రపంచవ్యాప్తంగా మరోమారు కరోనా విజృంభణ మొదలు కావడంతో భారత్, పాకిస్థాన్, అమెరికా, బ్రిటన్‌తోపాటు మరో నాలుగు దేశాల నుంచి వచ్చే విమానాలపై హాంకాంగ్ ఈ నెల 21 వరకు నిషేధం విధించింది. హాంకాంగ్ తీరానికి చేరుకున్న నౌకలో 9 మంది ఒమిక్రాన్ బాధితులు ఉండడంతో వారిని నౌకలోనే ఉంచేశారు. అందులోని వేలాది మంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఒమిక్రాన్ రోగులు 9 మందికీ నెగటివ్ రిపోర్టులు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, వ్యాక్సిన్ తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హెచ్చరించారు. వారి జీవితాలకు పరిమితులు విధిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ వేసుకోని వారిని ఇలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
COVID19
USA
Europe
Omicron

More Telugu News